ప్రియుడితో చాటింగ్ కోసం కన్నతల్లికే మూడు నెలల పాటు నిద్రమాత్రలు ఇచ్చిన మైనర్ కూతురు

లక్నోలోని కృష్ణనగర్ ప్రాంతంలో వెలుగుచూసిన ఒక షాకింగ్ ఘటన అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన పొరుగు యువకుడితో అర్ధరాత్రి వరకు చాటింగ్ చేసేందుకు అడ్డుగా ఉన్న తల్లిని వదిలించుకోవాలని ఒక 15 ఏళ్ల బాలిక దారుణానికి ఒడిగట్టింది. తల్లి నిద్రపోతేనే తాను స్వేచ్ఛగా ప్రియుడితో మాట్లాడుకోవచ్చని భావించిన ఆ బాలిక, వరుసగా మూడు నెలల పాటు తల్లి ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది. దీనివల్ల ఆ తల్లి తీవ్రమైన నీరసానికి, మత్తుకు లోనయ్యారు. డాక్టర్ల పరీక్షల్లో ఆమె శరీరంలో నిద్రమాత్రల మోతాదు ఎక్కువగా ఉందని తేలడంతో అసలు విషయం బయటపడింది.
విచారణలో ఆ బాలిక స్వయంగా నిజాన్ని ఒప్పుకుంది. ఆమెకు ఆ నిద్రమాత్రలను ఆ యువకుడే సరఫరా చేసేవాడని తెలిసింది. ప్రస్తుతం ఆ బాలికను లోకబంధు ఆసుపత్రిలోని ‘వన్ స్టాప్ సెంటర్’కు కౌన్సెలింగ్ కోసం తరలించారు. తన కూతురు చేసిన పనికి ఆ తల్లి షాక్ తిన్నప్పటికీ, ఆమెపై ఎలాంటి పోలీసు కేసు పెట్టకుండా తన కూతురిని మార్చుకుంటానని హామీ ఇచ్చారు. ఫోన్ వాడకాన్ని కేవలం చదువుకే పరిమితం చేయాలని, అనవసరమైన చాటింగ్‌లకు దూరంగా ఉండాలని కౌన్సెలర్లు ఆ బాలికకు హితబోధ చేస్తున్నారు.