ఉదయాన్నే ఖాళీ కడుపుతో చియా విత్తనాలు లేదా అవిసె గింజలు, ఆరోగ్యానికి ఏది అత్యంత మేలు చేస్తుంది

ప్రస్తుత కాలంలో ఆరోగ్య పట్ల శ్రద్ధ చూపే వారి ఆహార జాబితాలో చియా విత్తనాలు మరియు అవిసె గింజలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ రెండు రకాల విత్తనాలు పోషకాలతో నిండి ఉన్నప్పటికీ, శరీరానికి అందించే ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి. చియా విత్తనాలు నీటిని ఎక్కువగా గ్రహించి కడుపు నిండుగా ఉంచుతాయి, తద్వారా బరువు తగ్గాలనుకునే వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అదేవిధంగా అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును నియంత్రించడమే కాకుండా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మహిళల్లో హార్మోన్ల సమతుల్యతకు మరియు చర్మ సౌందర్యానికి కూడా ఇవి అద్భుతంగా పనిచేస్తాయి.
అయితే వీటిని తీసుకునే విధానం చాలా ముఖ్యం. చియా విత్తనాలను కనీసం అరగంట పాటు నీటిలో నానబెట్టి, ఉదయాన్నే నిమ్మరసం లేదా స్మూతీలతో తీసుకోవాలి. మరోవైపు అవిసె గింజలను నేరుగా తీసుకోకుండా, దోరగా వేయించి పొడి చేసి తీసుకోవడం వల్ల పూర్తి పోషకాలు అందుతాయి. ఎందుకంటే శరీరానికి అవిసె గింజలను నేరుగా అరిగించుకునే శక్తి ఉండదు. బరువు తగ్గాలనుకునే వారు చియా విత్తనాలకు ప్రాధాన్యత ఇవ్వగా, గుండె ఆరోగ్యం మరియు హార్మోన్ల సమస్యల కోసం అవిసె గింజలు ఉత్తమ ఎంపికగా నిలుస్తాయి. మీ ఆరోగ్య అవసరాలను బట్టి సరైన దానిని ఎంచుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చు.