డయాబెటిస్ ఉన్నవారు ఎండ దెబ్బ బారిన పడే ప్రమాదం ఎందుకు ఎక్కువగా ఉంటుందో మీకు తెలుసా

తీవ్రమైన ఎండలు మధుమేహ వ్యాధిగ్రస్తులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, శరీరం మూత్రం ద్వారా అదనపు చక్కెరను బయటకు పంపే క్రమంలో త్వరగా నీటిని కోల్పోయి డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీనివల్ల హిట్ స్ట్రోక్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అంతేకాకుండా, దీర్ఘకాలిక డయాబెటిస్ వల్ల శరీరంలోని చెమట గ్రంథులు దెబ్బతింటాయి, దీనివల్ల శరీరం తనను తాను చల్లబరుచుకోలేదు. కాబట్టి దాహం వేయకపోయినా రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీటిని తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎండ తీవ్రతకు ఇన్సులిన్ మరియు గ్లూకోమీటర్లు పాడయ్యే అవకాశం ఉన్నందున వాటిని ఎల్లప్పుడూ చల్లని ప్రదేశంలో భద్రపరచాలి. వేసవిలో టీ, కాఫీ మరియు సాఫ్ట్ డ్రింక్స్‌కు దూరంగా ఉంటూ కొబ్బరి నీళ్లు లేదా పంచదార లేని నిమ్మరసం తీసుకోవడం ఉత్తమం. బయటకు వెళ్లేటప్పుడు లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి మరియు పాదాల నరాల సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ పాదాలతో నడవకూడదు. ఎండలో నడవడం వల్ల వచ్చే చిన్న బొబ్బలు కూడా ఇన్ఫెక్షన్లకు దారితీసే ప్రమాదం ఉందని గమనించాలి.