షాపింగ్ మాల్స్‌లో బిల్లు చెల్లింపునకు ఫోన్ నంబర్ ఇకపై తప్పనిసరి కాదు

షాపింగ్ మాల్స్ లేదా రిటైల్ దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లు తమ మొబైల్ నంబర్‌ను ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బిల్లు తయారీ సమయంలో మొబైల్ నంబర్ అడగడం అనేది విక్రయానికి ముందస్తు షరతు కాకూడదని కేంద్ర సహాయ మంత్రి పి. చంద్రశేఖర్ లోక్‌సభలో వెల్లడించారు. 2023 నాటి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం, కస్టమర్ అనుమతి లేకుండా వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం నిబంధనలకు విరుద్ధం. మొబైల్ నంబర్ ఇవ్వలేదనే కారణంతో ఏ వ్యాపారి కూడా వినియోగదారుడికి సేవలను నిరాకరించకూడదని కేంద్రం ఆదేశించింది.
సాధారణంగా పెద్ద పెద్ద స్టోర్లలో బిల్లు వేసే సమయంలో ఫోన్ నంబర్ అడగడంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తికి ఈ నిర్ణయంతో తెరపడనుంది. వ్యక్తిగత గోప్యతను కాపాడటం మరియు డేటా దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. వ్యాపార అవసరాల కోసం సమాచారాన్ని సేకరించినా, దాన్ని చట్టబద్ధంగా మాత్రమే ఉపయోగించాలని మంత్రి పేర్కొన్నారు. గత మూడేళ్లలో దీనిపై అధికారిక ఫిర్యాదులు అందకపోయినా, వినియోగదారుల హక్కులను కాపాడటమే తమ ప్రాధాన్యతని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు కస్టమర్ తన నంబర్‌ను షేర్ చేయాలా వద్దా అనేది పూర్తిగా వారి ఇష్టానికే వదిలేశారు.