వెండి నగలు దోచుకునేందుకు 90 ఏళ్ల వృద్ధురాలిని మంచంతో సహా ఎత్తుకెళ్లిన దొంగలు

రాజస్థాన్లోని భిల్వారా జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే దొంగతనం యత్నం వెలుగుచూసింది. బుధవారం రాత్రి కోఠియా గ్రామంలో మాజీ సర్పంచ్ నతీ దేవీ మాలి ఇంట్లోకి చొరబడ్డ దొంగలు, కుటుంబ సభ్యులను గదుల్లోనే నిర్బంధించి బయట గడియ పెట్టారు. ఆ సమయంలో వరండాలో మంచంపై నిద్రిస్తున్న 90 ఏళ్ల చోటీ దేవి ఒంటిపై ఉన్న ఒకటిన్నర కిలోల వెండి నగలను చూసిన దొంగలు, ఆమెను మంచంతో సహా సమీపంలోని పొలాల్లోకి ఎత్తుకెళ్లారు. అక్కడ వృద్ధురాలి నోరు మూసి, కాళ్లు చేతులు కట్టేసి నగలు కాజేయడానికి ప్రయత్నించారు.
అయితే కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో గ్రామస్థులు వచ్చి గదుల తాళాలు పగలగొట్టి చూడగా వృద్ధురాలు కనిపించలేదు. వెంటనే గాలింపు చేపట్టగా పొలంలో దీనస్థితిలో ఉన్న ఆమెను గుర్తించారు. గ్రామస్థులు అప్రమత్తం కావడంతో దొంగలు నగలు తీసుకోకుండానే అక్కడి నుండి పరారయ్యారు. వెండి ధరలు విపరీతంగా పెరగడం వల్లే గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దాడులు జరుగుతున్నాయని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.