డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ రాదు, మార్చి 1 నుంచి భారీ తనిఖీలు ప్రారంభం

మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్నారా? అయితే వెంటనే అప్రమత్తం కావాల్సిందే. మార్చి 1వ తేదీ నుంచి రహదారులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు హైవే పోలీసులు స్పష్టం చేశారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, చట్టపరమైన నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రోడ్డు భద్రతను పెంపొందించే ఉద్దేశంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
కేవలం జరిమానాలే కాకుండా, లైసెన్స్ లేకపోవడం వల్ల కలిగే ఆర్థిక నష్టాల గురించి కూడా అధికారులు వివరించారు. ఒకవేళ లైసెన్స్ లేని వ్యక్తి నడుపుతున్న వాహనం ప్రమాదానికి గురైతే, ఆ వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ వర్తించదని హైవే పోలీసులు తెలిపారు. అంటే ప్రమాదం జరిగితే పూర్తి ఆర్థిక భారాన్ని వాహన యజమానే భరించాల్సి ఉంటుంది. కావున, ఇప్పటి వరకు లైసెన్స్ లేని వారు వెంటనే సంబంధిత ఆర్టీఏ (RTA) కార్యాలయాన్ని సంప్రదించి లైసెన్స్ పొందాలని అధికారులు సూచిస్తున్నారు.