ప్రేమ కోసం వీసా లేకుండా పాకిస్థాన్‌కు, అలీగఢ్ యువకుడి వింత కథ

అలీగఢ్‌కు చెందిన బాదల్ బాబు అనే యువకుడు సోషల్ మీడియాలో పరిచయమైన సనా అనే యువతి కోసం వీసా లేకుండానే సరిహద్దులు దాటి పాకిస్థాన్ చేరుకున్నాడు. అక్కడ తన మతము మార్చుకుని రహస్యంగా జీవించడం ప్రారంభించాడు. అయితే ఒకరోజు మాట్లాడుతున్న సమయంలో తన ప్రాంతీయ భాషా పదమైన ‘కఛూ నాయ్ హై రవ్’ అని పలకడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు పట్టించారు. దీనితో అక్రమ ప్రవేశం కింద ఒక సంవత్సరం పాటు పాకిస్థాన్ జైలులో శిక్ష అనుభవించాడు.
ప్రస్తుతం జైలు నుండి విడుదలైన బాదల్ అక్కడ ఒక డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నాడు. తనను పెళ్లి చేసుకోవడానికి సనా నిరాకరించడంతో అక్కడే ఉండిపోయిన బాదల్‌ను తిరిగి భారత్‌కు తీసుకురావాలని అతని కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తన కొడుకును తిరిగి రప్పించేందుకు తల్లిదండ్రులు పాకిస్థాన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఒక చిన్న మాట పొరపాటు వల్ల ఈ ప్రేమ కథ కాస్తా జైలు పాలవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.