రైలు నడుపుతున్నప్పుడు లోకో పైలట్‌కు అర్జెంట్‌గా టాయిలెట్ వస్తే పరిస్థితి ఏంటి, రైల్వే శాఖ నిబంధనలు ఇవే

భారతీయ రైల్వేలో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి బోగీలోనూ వాష్‌రూమ్ సౌకర్యం ఉంటుంది, కానీ రైలును నడిపే లోకో పైలట్ల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. రైల్వే నిబంధనల ప్రకారం, విధుల్లో చేరడానికి ముందే పైలట్లు తమ కాలకృత్యాలను తీర్చుకోవాల్సి ఉంటుంది. రైలు ప్రయాణం ప్రారంభమైన తర్వాత కనీసం 3 నుండి 4 గంటల వరకు వారు నిరంతరాయంగా ఇంజిన్‌లోనే ఉండాలి. ఈ సమయంలో ప్రకృతి పిలుపు వచ్చినా వారు నియంత్రించుకోవాల్సి ఉంటుందని రైల్వే నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
ఒకవేళ అత్యవసర పరిస్థితి ఏర్పడి, లోకో పైలట్ ఖచ్చితంగా వాష్‌రూమ్‌కు వెళ్లాల్సి వస్తే, అందుకోసం ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. అటువంటి సమయంలో పైలట్ వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించి, తదుపరి స్టేషన్‌లో రైలును ఆపడానికి అనుమతి కోరతారు. కంట్రోల్ రూమ్ నుండి గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాత మాత్రమే రైలును ఆపి, వారు తమ అవసరాన్ని తీర్చుకోవడానికి వీలుంటుంది. సాధారణంగా లోకో పైలట్ల డ్యూటీ 8 గంటలు ఉన్నప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా ఈ కఠినమైన నిబంధనలను వారు పాటించాల్సి ఉంటుంది.