ఆర్టీఐ చట్టంలో భారీ మార్పుల దిశగా కేంద్రం అడుగులు పౌర హక్కులపై ఆందోళన

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో సమాచార హక్కు (RTI) చట్టాన్ని పునఃసమీక్షించాలని ప్రతిపాదించారు. ప్రభుత్వ రహస్య పత్రాల పట్ల ‘అనవసరమైన ఉత్సుకత’ మరియు ఫైళ్లు బహిర్గతం అవుతాయనే భయం పరిపాలనా వేగాన్ని అడ్డుకుంటున్నాయని సర్వే పేర్కొంది. దీనివల్ల ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన డ్రాఫ్ట్ నోట్స్ మరియు అధికారుల మధ్య జరిగే అంతర్గత చర్చలను ఈ చట్టం పరిధి నుండి మినహాయించాలని కేంద్రం భావిస్తోంది.
ప్రభుత్వ ప్రతిపాదనలపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. పౌరుల రాజ్యాంగ హక్కులను హరించడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పారదర్శకతను దెబ్బతీసి అవినీతిని కప్పిపుచ్చడానికే ఈ మార్పులు తెస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికే వేల సంఖ్యలో ఆర్టీఐ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న తరుణంలో, చట్టాన్ని నీరుగార్చే ఈ ప్రయత్నం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది.