డిజిటల్ అరెస్ట్ నుంచి వృద్ధురాలి కోటి రూపాయల పొదుపును కాపాడిన బ్యాంక్ మేనేజర్

లక్నోలోని మామా చౌరహా పిఎన్‌బి శాఖలో ఒక 75 ఏళ్ల వృద్ధురాలు తన 1.13 కోట్ల రూపాయల విలువైన 12 ఎఫ్‌డిలను వెంటనే రద్దు చేయాలని పట్టుబట్టారు. ఆమె భయాందోళనలను గమనించిన బ్యాంక్ మేనేజర్ అనుమానంతో విచారించగా, అసలు విషయం బయటపడింది. ఆ వృద్ధురాలిని గత నాలుగు రోజులుగా నకిలీ సిబిఐ అధికారులు డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెడుతున్నట్లు బ్యాంక్ సిబ్బంది గుర్తించారు.
మనీ లాండరింగ్ కేసులో ఇరికిస్తామని బెదిరించి ఆమె జీవితకాల సంపాదనను కాజేయాలని సైబర్ నేరగాళ్లు ప్లాన్ చేశారు. అయితే బ్యాంక్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి, మూడు గంటల పాటు ఆమెతో మాట్లాడి ధైర్యం చెప్పి ఆ భారీ మొత్తాన్ని కాపాడారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి మోసాన్ని అరికట్టిన బ్యాంక్ అధికారులను పోలీసులు ప్రత్యేకంగా అభినందించారు. డిజిటల్ అరెస్ట్ అనేది చట్టవిరుద్ధమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బ్యాంక్ సూచించింది.