ఒకే లాంచర్ నుండి నిప్పులు చెరుగుతూ దూసుకెళ్లిన రెండు ప్రళయ్ క్షిపణులు శత్రువుల గుండెల్లో వణుకు

భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) బుధవారం ఉదయం ఒడిశా తీరంలో ‘ప్రళయ్’ క్షిపణిని వరుసగా రెండుసార్లు విజయవంతంగా పరీక్షించి చరిత్ర సృష్టించింది. ఒకే లాంచర్ నుండి కేవలం సెకన్ల వ్యవధిలో ప్రయోగించిన ఈ రెండు క్షిపణులు తమ లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించాయి. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో, ఘన ఇంధనంతో పనిచేసే ఈ క్షిపణి 500 నుండి 1000 కిలోల వరకు యుద్ధసామగ్రిని మోసుకెళ్లగలదు. ఈ ప్రయోగం భారత క్షిపణి వ్యవస్థల యొక్క తిరుగులేని సామర్థ్యాన్ని మరియు నమ్మకాన్ని మరోసారి చాటిచెప్పింది.
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ అద్భుత విజయానికి గాను డీఆర్డీఓ మరియు సాయుధ బలగాలను అభినందించారు. హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ మరియు భారతీయ పరిశ్రమల సహకారంతో అభివృద్ధి చేయబడిన ఈ క్షిపణి త్వరలోనే సైన్యంలో చేరనుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడం వల్ల భారత రక్షణ రంగం మరింత బలోపేతం అయిందని, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం దిశగా ఇది కీలక అడుగు అని డీఆర్డీఓ ఛైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ పేర్కొన్నారు.