మీరు పడుకునే విధానం మీ ఆరోగ్యానికి శత్రువా నిపుణులు ఏమంటున్నారు

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర ఎంత అవసరమో, పడుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం. తప్పుడు పొజిషన్లో నిద్రించడం వల్ల వెన్నునొప్పి, మెడ పట్టేయడం మరియు శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతాయని ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ కుశాల్ కాంత్ మిశ్రా హెచ్చరిస్తున్నారు. వెన్నునొప్పితో బాధపడేవారు వెల్లకిలా పడుకోవడం లేదా కాళ్ల కింద దిండు పెట్టుకుని పక్కకు తిరిగి పడుకోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే గురక సమస్య ఉన్నవారు వెల్లకిలా పడుకోకుండా పక్కకు తిరిగి పడుకోవడం వల్ల శ్వాస మార్గం సాఫీగా ఉంటుంది.
గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా మూడవ త్రైమాసికంలో ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం వల్ల శిశువుకు రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. మెడ నొప్పితో బాధపడేవారు మరీ ఎత్తుగా లేదా మరీ పల్చగా ఉండే దిండ్లను వాడకుండా, మధ్యస్థంగా ఉండే దిండుపై వెల్లకిలా పడుకోవడం శ్రేయస్కరం. సరైన స్థితిలో నిద్రించడం వల్ల శరీర కండరాలు విశ్రాంతి పొంది, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి మేల్కొన్నప్పుడు హుషారుగా ఉండాలంటే పడుకునే విధానంలో ఈ మార్పులు తప్పనిసరి.