10 ఏళ్ల తర్వాత సాధువు వేషంలో వచ్చి భార్యను దారుణంగా అంతమొందించిన భర్త

ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో పదేళ్లుగా విడిగా ఉంటున్న భార్యను ఆమె భర్త దారుణంగా హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బీహార్‌కు చెందిన ప్రమోద్ కుమార్ ఝా (60), తన భార్య కిరణ్ ఝా (50) తో గొడవల కారణంగా గత పదేళ్లుగా దూరంగా ఉంటున్నాడు. బుధవారం తెల్లవారుజామున సాధువు వేషంలో వచ్చి, కుటుంబ సభ్యులను తప్పుదోవ పట్టించి ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం నిద్రపోతున్న తన భార్యపై సుత్తితో దాడి చేసి హత్య చేశాడు.
గృహహింస కారణంగా కిరణ్ తన కుమారుడితో కలిసి ఢిల్లీలో నివసిస్తోంది. ముందస్తు పథకం ప్రకారమే ప్రమోద్ బీహార్ నుండి సాధువు రూపంలో వచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. తెల్లవారుజామున రక్తపు మడుగులో ఉన్న అత్తను చూసిన కోడలు కేకలు వేయడంతో విషయం బయటకు వచ్చింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన రెండు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.