వేరే మతస్థుడిని పెళ్లి చేసుకున్న కూతురికి తండ్రి ఆస్తిలో వాటా లేదు సుప్రీంకోర్టు సంచలన తీర్పు

వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు ఒక తండ్రి తన వీలునామాలో కూతురికి చోటు కల్పించలేదు. ఈ అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, తన ఆస్తిని ఎవరికి ఇవ్వాలనేది తండ్రి ఇష్టమని స్పష్టం చేస్తూ ఆయన నిర్ణయాన్ని సమర్థించింది. జస్టిస్ ఎహసానుద్దీన్ అమానుల్లా మరియు జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం హైకోర్టు మరియు ట్రయల్ కోర్టు ఇచ్చిన పాత తీర్పులను కొట్టివేసింది. తండ్రి రాసిన వీలునామా చట్టబద్ధంగా చెల్లుతుందని, అందులో కూతురికి ఎటువంటి హక్కు లేదని కోర్టు తేల్చి చెప్పింది.
తొమ్మిది మంది తోబుట్టువులలో ఒకరైన షైలా జోసెఫ్ తన తండ్రి ఆస్తిలో సమాన వాటా కోరుతూ కోర్టును ఆశ్రయించారు. అయితే వీలునామా విషయంలో సమానత్వపు హక్కు వర్తించదని, ఆస్తి యజమాని చివరి కోరికకే ప్రాధాన్యత ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఆస్తి పంపకాల విషయంలో ఒక వ్యక్తి తీసుకున్న సొంత నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తండ్రి నిర్ణయం వెనుక ఉన్న కారణాలను గౌరవిస్తూ, షైలా వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.