అంతరిక్షంలో సంచలనం గెలాక్సీ నుండి బయటపడి బుల్లెట్ వేగంతో దూసుకెళ్తున్న భారీ బ్లాక్ హోల్
December 17, 2025

నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అంతరిక్షంలో ఒక అరుదైన దృశ్యాన్ని బంధించింది. సుమారు 8.8 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ‘కాస్మిక్ అవుల్’ గెలాక్సీ నుండి ఒక భారీ బ్లాక్ హోల్ విడివడి, అంతరిక్షంలో ఒంటరిగా ప్రయాణిస్తోంది. గెలాక్సీల విలీనం సమయంలో ఏర్పడిన గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఈ రాక్షస బ్లాక్ హోల్ తన నివాసం నుండి బయటకు నెట్టివేయబడింది.
ఈ బ్లాక్ హోల్ తన వెనుక సుమారు 2 లక్షల కాంతి సంవత్సరాల పొడవైన కాంతి రేఖను వదిలి వెళ్తోంది. ఇది ఎంత వేగంగా దూసుకెళ్తోందంటే, దాని ప్రయాణ మార్గంలో వాయువులు ఒత్తిడికి లోనై వేల సంఖ్యలో కొత్త నక్షత్రాలు పుట్టుకొస్తున్నాయి. సాధారణంగా విధ్వంసానికి మారుపేరైన బ్లాక్ హోల్, ఇలా నక్షత్రాల సృష్టికి కారణమవ్వడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.