IRCTC: ఈ పొరపాటు చేస్తున్నారా? మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ బ్యాన్.. ఇప్పటికే 3 కోట్లకుపైగా బ్లాక్!

భారతీయ రైల్వే టికెట్ బుకింగ్‌లలో మోసాలను నిరోధించడానికి కఠినమైన చర్యలు తీసుకుంది. ముఖ్యంగా తత్కాల్ టిక్కెట్ బుకింగ్‌కు ఇకపై ఆధార్-ఆధారిత OTP ధృవీకరణ తప్పనిసరి చేశారు. ప్రస్తుతం 322 రైళ్లలో ఈ కొత్త నిబంధన అమలులో ఉంది, దీనిని దశలవారీగా అన్ని రైళ్లలో ప్రవేశపెట్టనున్నారు. ఈ చర్యతో సాధారణ ప్రయాణీకులకు తత్కాల్ టిక్కెట్‌లు కన్ఫర్మ్ అయ్యే అవకాశం పెరుగుతుంది.
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో మాట్లాడుతూ, టికెట్ బుకింగ్ వ్యవస్థలో కఠినత తీసుకురావడానికి ఈ చర్యలు చేపట్టామని అన్నారు. ఇప్పటికే 3.02 కోట్లకు పైగా అనుమానాస్పద IRCTC ఖాతా ఐడీలను నిష్క్రియం చేసినట్లు తెలిపారు. మోసపూరిత బుకింగ్‌లను అరికట్టడానికి ఆటోమేటెడ్ స్క్రిప్ట్‌లను బ్లాక్ చేసే ‘అకమై’ (Akamai) వంటి యాంటీ-బాట్ సాధనాలను కూడా ప్రవేశపెట్టారు. దీని ఫలితంగా 96 రైళ్లలో తత్కాల్ బుకింగ్‌లలో టికెట్ నిర్ధారణ 95%కి చేరుకుందని మంత్రి చెప్పారు.