3 ఏళ్ల బిడ్డతో పెళ్లి మండపానికి తొలి భార్య ఎంట్రీ! మోగాలో రెండో పెళ్లి ఆగిపోవడానికి కారణం ఏమిటి?

పంజాబ్‌లోని మోగా నగరంలో ఒక ప్రైవేట్ హోటల్‌లో వివాహ వేడుక జరుగుతుండగా, 3 ఏళ్ల బిడ్డను పట్టుకుని ఒక యువతి ఒక్కసారిగా అక్కడికి చేరుకుంది. ఆ వరుడు తన చట్టబద్ధమైన భర్త అని, 5-6 ఏళ్ల క్రితం తమకు కోర్టు మ్యారేజ్ జరిగిందని గట్టిగా అరిచి, రెండో పెళ్లిని ఆపేసింది. ఆమె వెంటనే 112 పోలీస్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయడంతో వివాహం నిలిచిపోయి, మండపంలో గందరగోళం చెలరేగింది.
తనను, బిడ్డను విడిచిపెట్టి విడాకులు లేకుండా తన భర్త రెండో పెళ్లికి ప్రయత్నిస్తున్నాడని ఆ యువతి ఆరోపించింది. అయితే, వరుడి కుటుంబం దీన్ని ఖండించింది, తాము వివాహ వార్షికోత్సవం జరుపుకోవడానికి వచ్చామని చెప్పింది. సమాచారం అందుకుని మోగా సదర్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, అక్కడ వరుడు లేదా వధువు ఎవరూ లేరు. అప్పటికే అందరూ అక్కడి నుంచి పారిపోయారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, త్వరలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.