ఓటమి నిరాశను సభలో చూపొద్దు! ప్రతిపక్షాలకు ప్రధాని మోడీ సంచలన హెచ్చరిక
December 1, 2025

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాకముందే ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలకు గట్టి హెచ్చరిక చేశారు. పరోక్షంగా కాంగ్రెస్తో సహా ఇతర ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని, పార్లమెంట్ నాటకాలు ఆడే స్థలం కాదని, పని చేయడానికి ఉద్దేశించిన వేదిక అని అన్నారు. ఎన్నికల ఓటమి వల్ల కలిగిన నిరాశను సభలో వ్యక్తం చేయవద్దని హెచ్చరించిన ఆయన, ప్రజాప్రతినిధులందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
సోమవారం తన సంప్రదాయ ప్రసంగంలో ప్రధాని మాట్లాడుతూ, దేశాభివృద్ధికి సానుకూల దృక్పథం అవసరం. బీహార్ ఎన్నికల ఫలితాలు వచ్చిన ఇన్ని రోజుల తర్వాత కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఓటమిని అంగీకరించలేకపోతున్నాయి. ప్రతికూల అంశాలను తగ్గించి, దేశ నిర్మాణ లక్ష్యంపై అందరూ దృష్టి సారించాలని, క్లిష్ట ప్రశ్నలు వేయడంతో పాటు బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని ఆయన కోరారు.