నేపాల్ కొత్త వంద రూపాయల నోటుపై మళ్లీ ‘భారత భూభాగం’ సరిహద్దు వివాదంపై ఉద్రిక్తత

నేపాల్ రాష్ట్రీయ బ్యాంక్ (Nepal Rastra Bank) ఇటీవల విడుదల చేసిన కొత్త 100 నేపాలీ రూపాయి నోటుపై, భారత దేశంలోని కాలాపానీ, లిపులేఖ్, మరియు లింపియాధురా ప్రాంతాలను నేపాల్ తమ మ్యాప్‌లో చూపించింది. ఐదేళ్ల క్రితం కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం హయాంలో రూపొందించిన వివాదాస్పద మ్యాప్ ఇది. కొత్త బ్యాంక్ నోటుపై ఈ వివాదాస్పద మ్యాప్‌ను ఉపయోగించడం వలన భారత్-నేపాల్ సరిహద్దు వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారి తీసింది. నేపాల్ తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయాన్ని భారత్ మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
నేపాల్ యొక్క ఏకపక్ష మ్యాప్ మార్పు వాస్తవ పరిస్థితిని మార్చలేదని, ఈ నిర్ణయం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత్ స్పష్టం చేసింది. 1816 సుగౌలి ఒప్పందం ప్రకారం కాళీ నది మూలమైన లింపియాధురా వరకు తమ భూభాగమేనని నేపాల్ వాదిస్తోంది. అయితే, కాళీ నది అసలు మూలం ఉత్తరాఖండ్‌లోని కాలాపానీలో ఉందని, నేపాల్ వాదనకు చారిత్రక ఆధారం లేదని భారత్ భావిస్తోంది. ఈ వివాదాస్పద నోటు విడుదల రెండు దేశాల దౌత్య సంబంధాలపై మరింత అస్థిరతను పెంచింది.