పెళ్లయిన 15 రోజులకే పెను వివాదం! వధువు గుండు రహస్యం బయటపడటంతో విడాకులు కోరిన వరుడు

ఉత్తరప్రదేశ్‌లోని పిపిగంజ్‌లో ఇటీవల జరిగిన పెళ్లి, వధువుకు సంబంధించిన ఒక రహస్యం బయటపడటంతో 15 రోజుల్లోనే విడాకుల వరకు వెళ్లింది. వధువు బట్టతల దాచడానికి విగ్గు ధరించిందని, ఈ ముఖ్యమైన విషయాన్ని దాచి తమను మోసం చేశారని వరుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విగ్గు తొలగిపోవడంతో ఈ నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో అత్తమామలు ఆమెను కోడలిగా అంగీకరించడానికి నిరాకరించి, పుట్టింటికి పంపించేశారు.
దీంతో వధువు తల్లి పిపిగంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ కూతురిని అత్తింటికి తీసుకెళ్లడానికి వరుడు నిరాకరిస్తున్నారని ఆమె ఆరోపించారు. పోలీసులు ఇరుపక్షాలను పిలిపించి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు, కానీ ఇరువైపులా తమ పట్టుదలతో ఉండటంతో సయోధ్య కుదరలేదు. అత్తింటివారు కోడలిని తిరిగి తీసుకెళ్లడానికి నిరాకరించారు. వచ్చే వారం మరోసారి పంచాయతీ ఏర్పాటు చేశామని, చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.