100 కోట్ల ఆండ్రాయిడ్ ఫోన్లకు పొంచి ఉన్న ముప్పు, గూగుల్ కీలక ప్రకటనతో యూజర్లలో ఆందోళన

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 కోట్ల మంది ఆండ్రాయిడ్ వినియోగదారులను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఆండ్రాయిడ్ 12 లేదా అంతకంటే పాత వర్షన్లతో పనిచేసే స్మార్ట్‌ఫోన్లకు ఇకపై సెక్యూరిటీ అప్‌డేట్స్ నిలిపివేస్తున్నట్లు గూగుల్ స్పష్టం చేసింది. దీనివల్ల పాత ఫోన్లు నేరుగా హ్యాకర్ల బారిన పడే ప్రమాదం ఉంది. గణాంకాల ప్రకారం సుమారు 42.1 శాతం మంది వినియోగదారులు ఇప్పటికీ పాత సాఫ్ట్‌వేర్‌నే వాడుతున్నారు, వీరికి వైరస్ లేదా మాల్వేర్ల నుండి రక్షణ కల్పించే సెక్యూరిటీ ప్యాచెస్ ఇకపై అందుబాటులో ఉండవు.
ముఖ్యంగా 2021 లేదా అంతకంటే ముందు విడుదలైన ఫోన్లను వాడుతున్న వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఆండ్రాయిడ్ 13 నుండి లేటెస్ట్ 16 వర్షన్లు మాత్రమే సురక్షితంగా పరిగణించబడుతున్నాయి. యాపిల్ తన పాత ఐఫోన్లకు కూడా ఎక్కువ కాలం అప్‌డేట్స్ ఇస్తుండగా, శామ్‌సంగ్ మరియు షావోమీ వంటి కంపెనీలు కొన్ని ఏళ్ల తర్వాత సపోర్ట్ నిలిపివేస్తుండటమే ఈ సమస్యకు ప్రధాన కారణం. మీ ఫోన్ సురక్షితమో కాదో తెలుసుకోవడానికి సెట్టింగ్స్‌లోని ‘అబౌట్ ఫోన్’ ద్వారా ఆండ్రాయిడ్ వర్షన్‌ను తనిఖీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.