హోంవర్క్ చేయలేదని రెండో తరగతి విద్యార్థిని కర్రతో 150 సార్లు బాదిన టీచర్, సస్పెండ్ చేసిన స్కూల్ యాజమాన్యం

ఉత్తరప్రదేశ్ గోండా జిల్లాలో హోంవర్క్ పూర్తి చేయలేదన్న కోపంతో ఒక ఉపాధ్యాయుడు రెండో తరగతి విద్యార్థిపై అమానుషంగా ప్రవర్తించారు. కర్నైల్‌గంజ్ ప్రాంతంలోని ఒక పాఠశాలలో ఇంగ్లీష్ హోంవర్క్ చేయలేదని 10 ఏళ్ల ప్రఖర్ సింగ్ అనే విద్యార్థిని కర్రతో సుమారు 150 సార్లు కొట్టారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు తీవ్రంగా గాయపడిన విద్యార్థి కుంటుకుంటూ ఇంటికి చేరుకున్నాడని, విషయం బయటకు చెబితే మళ్లీ కొడతానని టీచర్ బెదిరించాడని తెలిసింది. ఈ ఘటనపై స్పందించిన పాఠశాల ప్రిన్సిపాల్ సదరు ఉపాధ్యాయుడిని విధుల్లో నుండి తొలగించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో ఉత్తరప్రదేశ్ మైన్‌పురిలో ఒక మాజీ ఉపాధ్యాయురాలిపై పాత విద్యార్థి దారుణానికి ఒడిగట్టాడు. గత మూడేళ్లుగా వేధింపులకు గురిచేస్తున్న అఖండ్ ప్రతాప్ అనే 24 ఏళ్ల యువకుడు, జనవరి 20న ట్యూషన్‌కు వెళ్తున్న సదరు మహిళను అడ్డగించి దాడి చేశాడు. తనను ఒక గల్లీలోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించడంతో పదునైన ఆయుధంతో ఆమె పెదవి కోసేశాడు. బాధితురాలు ప్రస్తుతం ఆగ్రాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుండి ఆమెను వేధిస్తున్నాడని, ఆ వేధింపుల వల్లే ఆమె గతంలో ఉద్యోగం కూడా మానేసిందని పోలీసులు తెలిపారు.