సొంత ఇల్లు కట్టించే బ్యాంకులకే సొంత భవనాలు ఉండవా, అద్దె కొంపలోనే కార్యకలాపాలు సాగించడం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే

ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలనేది ఒక కల. చేతిలో నగదు లేనప్పుడు బ్యాంకుల నుండి హోమ్ లోన్ పొంది సామాన్యులు తమ కలలను నిజం చేసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇతరులకు ఇళ్లు కట్టించే బ్యాంకులు మాత్రం తమ కార్యకలాపాలను అద్దె భవనాల్లోనే నిర్వహిస్తుంటాయి. కొన్ని ప్రధాన ప్రాంతీయ కార్యాలయాలు మినహా, మెజారిటీ బ్యాంక్ శాఖలకు సొంత ఆస్తులు లేవు. ఆస్తి పత్రాల ఆధారంగా ఇతరులకు రుణాలు ఇచ్చే బ్యాంకులు, తమ స్వంత భవనాల విషయంలో ఎందుకు వెనుకబడి ఉన్నాయనే సందేహం చాలామందిలో కలుగుతుంది. అద్దె ఇంట్లో ఉండటమే బ్యాంకులకు లాభదాయకమా లేక దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా అనేది ఆసక్తికరమైన అంశం.
నిజానికి బ్యాంకులు అద్దె భవనాల్లో పనిచేయడం వెనుక ఎటువంటి వ్యాపార తర్కం లేదా కఠినమైన నిబంధనలు లేవు. ఇది కేవలం దశాబ్దాలుగా వస్తున్న ఒక సంప్రదాయం మాత్రమే. బ్యాంకింగ్ వ్యవస్థ ప్రారంభ దశలో సొంత భవనాలు లేకపోవడంతో అద్దె ప్రాంగణాల్లో కార్యకలాపాలు మొదలయ్యాయి, అది ఇప్పటికీ కొనసాగుతోంది. బ్యాంకుల ప్రధాన విధి తక్కువ వడ్డీకి డిపాజిట్లు సేకరించి, ఎక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం. డిపాజిటర్ల డబ్బును స్థిరాస్తులపై పెట్టుబడిగా పెట్టడానికి బ్యాంకులు ఇష్టపడవు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లోని పంచాయతీ కార్యాలయాలకు కూడా సొంత భవనాలు ఉన్నా, బ్యాంకులు మాత్రం అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ పాత పద్ధతిని మార్చుకోవాలని ఇప్పుడు పలువురు అభిప్రాయపడుతున్నారు.