సాధువు వేషంలో వచ్చి 10 ఏళ్లుగా దూరంగా ఉంటున్న భార్యను చంపిన భర్త
February 10, 2026

దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో ఘోరమైన ఘటన వెలుగుచూసింది. గత 10 ఏళ్లుగా వేరుగా ఉంటున్న భార్య కిరణ్ ఝాను, ఆమె భర్త ప్రమోద్ కుమార్ ఝా కిరాతకంగా హత్య చేశాడు. బీహార్‌కు చెందిన ప్రమోద్, కుటుంబ సభ్యులు గుర్తుపట్టకుండా సాధువు వేషంలో వచ్చి ఇంట్లోకి ప్రవేశించాడు. బుధవారం తెల్లవారుజామున అందరూ నిద్రిస్తున్న సమయంలో భార్యపై సుత్తితో దాడి చేసి ప్రాణాలు తీశాడు.
గృహహింస కారణంగా కిరణ్ గత దశాబ్ద కాలంగా తన భర్తకు దూరంగా ఉంటూ కుమారుడి వద్ద ఉంటోంది. డీసీపీ అంకిత్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రమోద్ ఈ హత్యను పక్కా ప్రణాళికతోనే చేశాడు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో కోడలు అత్తను రక్తపు మడుగులో చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ దారుణ ఘటన ఢిల్లీ నుండి బీహార్ వరకు సంచలనం సృష్టించింది.