శ్రీలీల వైరల్ వీడియో వెనుక ఉన్న అసలు నిజం ఇదే

హైదరాబాద్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్ శ్రీలీల మరియు నటుడు రంగస్థలం మహేష్ మధ్య జరిగిన ఒక చిన్న ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కళ్యాణ్ వేదికపై ప్రసంగిస్తున్న సమయంలో శ్రీలీల వెనక్కి తిరిగి మహేష్ వైపు సీరియస్‌గా చూడటంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.
శ్రీలీల వెనక్కి తిరిగి మహేష్‌పై కోప్పడిందని, అతను ఫోన్ చూస్తున్నందుకు లేదా అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆమె అలా చూసిందని నెటిజన్లు భావించారు. ఈ వీడియో క్లిప్ కాస్తా నెట్టింట వైరల్ కావడంతో మహేష్ ప్రవర్తనపై విమర్శలు వచ్చాయి. అయితే ఈ వివాదంపై తాజాగా ఒక ఫిల్మ్ జర్నలిస్ట్ పూర్తి స్పష్టతనిచ్చారు.
అసలు విషయం ఏమిటంటే, శ్రీలీల తన ఫోన్‌ను భద్రంగా ఉంచమని మహేష్‌కు ఇచ్చారు. స్టేజ్‌పై ఉండగా తన ఫోన్ ఎక్కడ ఉందో అని కేవలం వెనక్కి తిరిగి చూశారని, అంతకు మించి అక్కడ ఎలాంటి గొడవ జరగలేదని సదరు జర్నలిస్ట్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దీంతో ఈ వైరల్ వీడియో వెనుక ఉన్న తప్పుడు ప్రచారానికి తెరపడింది.