శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న ఇరాన్ డ్యాన్సింగ్ మిస్సైల్

శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న ఇరాన్ డ్యాన్సింగ్ మిస్సైల్

అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో అట్టుడుకుతున్న మధ్యప్రాచ్యంలో ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని బయటకు తీసింది. యుద్ధం మూడో వారానికి చేరుకున్న తరుణంలో, ఇరాన్ మొదటిసారిగా ‘సెజ్జిల్’ అనే అధునాతన బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఆకాశంలో మెరుపు వేగంతో దిశను మార్చుకోగల సామర్థ్యం ఉండటంతో దీనిని ‘డ్యాన్సింగ్ మిస్సైల్’ అని పిలుస్తారు. ఆదివారం ఇజ్రాయెల్ మరియు అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన దాడుల్లో ఈ క్షిపణులు కీలక పాత్ర పోషించినట్లు ఇరాన్ అధికారిక మీడియా ధృవీకరించింది.

సుమారు 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ సెజ్జిల్ క్షిపణి, 700 కిలోల బరువైన యుద్ధ సామాగ్రిని మోసుకెళ్లగలదు. ఇది రెండు దశల ఘన ఇంధన వ్యవస్థతో పనిచేస్తుంది. ఇజ్రాయెల్ గర్వంగా చెప్పుకునే ‘ఐరన్ డోమ్’ వంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థలను కూడా బోల్తా కొట్టించి లక్ష్యాన్ని చేరుకోవడం దీని ప్రత్యేకత. 18 మీటర్ల పొడవు, 23,600 కిలోల బరువున్న ఈ క్షిపణిని 2008లో తొలిసారి పరీక్షించగా, ఇప్పుడు నేరుగా యుద్ధరంగంలోకి దించడం సంచలనంగా మారింది.

ప్రస్తుతం గల్ఫ్ దేశాలలోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఈ భీకర పోరులో ఇప్పటికే 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ దాడుల ప్రారంభంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించినట్లు సమాచారం. తాజా పరిణామాలతో అగ్రరాజ్యం అమెరికా సహా ఇజ్రాయెల్‌కు ఇరాన్ గట్టి హెచ్చరికలు పంపినట్లయింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *