వ్యంగ్యంగా మాట్లాడితే కేసులు పెడతారా?: అంబటి
March 22, 2025

సినీనటుడు, హాస్యనటుడు పోసాని కృష్ణమురళి వ్యంగ్యంగా మాట్లాడారని కేసులు పెట్టడం సమంజసం కాదని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. వ్యంగ్యం మాట్లాడడం నేరమా? అని ప్రశ్నిస్తూ, అదే లాజిక్ ప్రకారం దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా చంద్రబాబుపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు, మరి ఆయనను కూడా అరెస్ట్ చేస్తారా? అని చంద్రబాబు అనుచరులను నిలదీశారు.
అంబటి రాంబాబు పేర్కొంటూ, వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ లీగల్ టీమ్ చాలా బలంగా ఉందని, ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాజకీయ వ్యంగ్యాన్ని అడ్డుకోవాలనుకోవడం ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకమని, న్యాయపరమైన పోరాటానికి వెనుకాడబోమని ఆయన హితవు పలికారు.