వోడాఫోన్ ఐడియా షేర్లలో భారీ పతనం ప్రభుత్వ ఊరట దక్కక ముందే కొత్త చిక్కులు

వోడాఫోన్ ఐడియాను ఆదుకునేందుకు కేంద్ర క్యాబినెట్ రూ. 87,695 కోట్ల ఏజీఆర్ బకాయిలపై ఐదేళ్ల మోరటోరియం ప్రకటించింది. దీని ప్రకారం బకాయిల చెల్లింపులు 2032 నుండి ప్రారంభమై 2041 వరకు కొనసాగుతాయి. వడ్డీ భారం తాత్కాలికంగా ఆగడం కంపెనీకి లైఫ్ లైన్ లాంటిదే అయినా, అప్పును పూర్తిగా రద్దు చేయకపోవడంతో ఇన్వెస్టర్లు నిరాశ చెందారు. ఫలితంగా ట్రేడింగ్ ప్రారంభమైన 30 నిమిషాల్లోనే షేరు ధర 15 శాతం కుప్పకూలింది.
మరోవైపు తెలంగాణ జీఎస్టీ విభాగం నుండి రూ. 6.78 కోట్ల జరిమానా నోటీసు రావడం కంపెనీకి గుదిబండగా మారింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ తప్పుగా క్లెయిమ్ చేశారనే ఆరోపణలతో ఈ పెనాల్టీ విధించారు. ఈ ఆదేశాలపై చట్టపరంగా పోరాడుతామని కంపెనీ తెలిపినప్పటికీ, మార్కెట్ సెంటిమెంట్ ప్రతికూలంగా ఉండటంతో షేరు ధర ప్రస్తుతం 10.81 వద్ద ట్రేడవుతోంది, ఇది నేటి ప్రారంభ ధర కంటే 10 శాతం తక్కువ.