వేసవి ప్రణాళికపై సీఎం కీలక ఆదేశాలు

వేసవి ప్రణాళికపై సీఎం కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా తాగునీటి సమస్య ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వేసవిలో తాగునీటి సరఫరా నిలకడగా ఉండేలా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. పంచాయతీ రాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖలతో పాటు విభిన్న విభాగాల అధికారులతో సమావేశమై సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై చర్చించారు. ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయడంతో పాటు, ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.

ఎండ వేడిమి పెరిగే ప్రాంతాల్లో మొబైల్ అలర్ట్స్ ద్వారా ప్రజలకు సమాచారం అందించి, వడదెబ్బ ప్రమాదం తగ్గించేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ పరంగా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో పశువులకు నీటి అందుబాటును మెరుగుపరిచేందుకు 12,138 నీటి తొట్ల నిర్మాణానికి రూ.35 కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు.

అదే విధంగా, పాఠశాలల్లో ‘వాటర్ బెల్’ విధానం అమలు చేసి, విద్యార్థులకు తాగునీరు నిరంతరం అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణ కోసం డ్రోన్ పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. నరేగా కూలీలకు అదనపు పనిదినాలు మంజూరు చేయడంతో పాటు, వారికి నీటి సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ఉపాధి కూలీలు, మున్సిపల్ కార్మికులు ఎండల తీవ్రతకు గురికాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రుల్లో వడదెబ్బ బాధితులకు తగిన చికిత్స అందుబాటులో ఉంచాలని, మారుమూల ప్రాంతాల్లో ఇప్పటి నుంచే దోమల నివారణ చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *