వర్షం ఆస్ట్రేలియా కొంపముంచింది.. పాకిస్థాన్‌కు మాత్రం జాక్‌పాట్ కొట్టేలా ఉంది

వర్షం ఆస్ట్రేలియా కొంపముంచింది.. పాకిస్థాన్‌కు మాత్రం జాక్‌పాట్ కొట్టేలా ఉంది

శ్రీలంక వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌లో వాతావరణం అనూహ్య మలుపులు తిప్పుతోంది. ఒక జట్టుకు శాపంగా మారిన వర్షం, మరో జట్టుకు అదృష్టాన్ని మోసుకొచ్చేలా కనిపిస్తోంది. గ్రూప్-బీలో పటిష్టమైన జట్టుగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను వరుణుడు కోలుకోలేని దెబ్బతీశాడు. జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దు కావడంతో జింబాబ్వేకు ఒక పాయింట్ లభించింది. దీంతో జింబాబ్వే 5 పాయింట్లతో ముందంజ వేయగా, ఆస్ట్రేలియా గరిష్టంగా సాధించగలిగే పాయింట్లు 4 మాత్రమే కావడంతో మాజీ ఛాంపియన్లు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. 2009 తర్వాత ఆస్ట్రేలియా ఇంత త్వరగా ఇంటిముఖం పట్టడం ఇదే తొలిసారి.

మరోవైపు ఆస్ట్రేలియా పాలిట విలన్‌గా మారిన వర్షం, ఇప్పుడు గ్రూప్-ఏలో ఉన్న పాకిస్థాన్ పాలిట ‘హీరో’గా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పాకిస్థాన్, అమెరికా రెండూ చెరో 4 పాయింట్లతో ఉన్నాయి. అమెరికా తన గ్రూప్ దశ మ్యాచ్‌లను పూర్తి చేసుకోగా, పాకిస్థాన్‌కు నేడు నమీబియాతో కీలక మ్యాచ్ మిగిలి ఉంది. ఒకవేళ కొలంబోలో వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే, పాకిస్థాన్‌కు లభించే ఆ ఒక్క పాయింట్ వారిని 5 పాయింట్లకు చేరుస్తుంది. తద్వారా ఎలాంటి కష్టం లేకుండానే అమెరికాను వెనక్కి నెట్టి పాక్ సూపర్-8కు అర్హత సాధిస్తుంది.

ప్రస్తుతం కొలంబోలోని ఎస్‌ఎస్‌సీ (SSC) స్టేడియంలో వాతావరణం మ్యాచ్ నిర్వహణకు ఏమాత్రం అనుకూలంగా లేదు. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం మధ్యాహ్నం వేళ ఉరుములతో కూడిన భారీ వర్షం పడే అవకాశం 70 శాతం వరకు ఉంది. ఒకవేళ వర్షం తగ్గినా, తడి అవుట్‌ఫీల్డ్ కారణంగా మ్యాచ్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పాకిస్థాన్ అభిమానులు వర్షం కోసం ఎదురుచూస్తుంటే, అమెరికా మాత్రం మ్యాచ్ జరగాలని, అందులో నమీబియా సంచలనం సృష్టించాలని కోరుకుంటోంది. ఏది ఏమైనా ప్రస్తుతం జట్ల ఆట కంటే వాతావరణమే వారి తలరాతలను నిర్ణయించేలా ఉంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *