వంటగ్యాస్ కష్టాలకు చెక్ పెడుతూ కేంద్రం కీలక ప్రకటన

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ముడిచమురు, గ్యాస్ సరఫరాపై నీలినీడలు ముసురుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో గ్యాస్ కొరత ఏర్పడుతుందనే ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు భారీ ఊరటనిచ్చింది. దేశంలోని సామాన్యుల అవసరాల కోసం 100 శాతం ఎల్పీజీ సరఫరాను కొనసాగిస్తామని కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం వాణిజ్య సిలిండర్ల సరఫరాపైనే తాత్కాలిక పరిమితులు విధించినట్లు వెల్లడించింది.
అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల గ్యాస్ ధరలు పెరగవచ్చని, సరఫరా నిలిచిపోతుందనే వదంతులు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనతో ముందస్తుగా సిలిండర్లను బుక్ చేసుకుంటున్నారు. ఈ అంశంపై కేంద్ర జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ స్పందిస్తూ, హార్మూజ్ జలసంధి వద్ద భారతీయ నౌకలు సురక్షితంగా ఉన్నాయని, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రజలు అనవసరంగా భయపడి అదనపు సిలిండర్ల కోసం పరుగులు తీయాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు.
తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచిస్తూనే, దేశీయ అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తిని పెంచాలని చమురు సంస్థలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. గృహ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిరంతర సరఫరాను పర్యవేక్షిస్తున్నట్లు కేంద్రం భరోసా ఇచ్చింది. అంతర్జాతీయ సంక్షోభం ఉన్నప్పటికీ, దేశంలోని వంటగ్యాస్ సరఫరా వ్యవస్థ పటిష్టంగా ఉందని ఈ ప్రకటన ద్వారా స్పష్టమైంది.