లంబీ జుదాయి పాటలో కనిపించిన ఆ నటి ఇక లేరు బాలీవుడ్‌లో విషాదం

బాలీవుడ్ సీనియర్ నటి మధు మల్హోత్రా (72) కన్నుమూశారు. 1980 మరియు 90వ దశకంలో అనేక హిందీ చిత్రాలలో సహాయ నటిగా నటించి ఆమె తనదైన ముద్ర వేశారు. ఆమె మృతితో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి.
దర్శకుడు సుభాష్ ఘాయ్ రూపొందించిన సూపర్ హిట్ చిత్రం ‘హీరో’లో మధు మల్హోత్రా పోషించిన పాత్ర ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ‘లంబీ జుదాయి’ పాటలో జిప్సీ మహిళగా ఆమె కనబరిచిన నటన ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రధాన పాత్రల్లో నటించకపోయినప్పటికీ, తన విలక్షణ నటనతో ఆమె బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు పొందారు.
అమితాబ్ బచ్చన్ నటించిన ‘సత్తే పే సత్తా’ వంటి మరెన్నో విజయవంతమైన చిత్రాల్లో ఆమె కీలక పాత్రలు పోషించారు. కథానాయికగా కాకుండా సహాయ నటిగా ఉన్నప్పటికీ, హిందీ సినీ రంగంలో ఆమెకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.