రాజకీయాలకు గుడ్ బై చెప్పి సాగు బాట పట్టిన విజయసాయి రెడ్డి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు నంబర్ 2గా చక్రం తిప్పిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పుడు అచ్చమైన రైతుగా మారిపోయారు. గత ఐదేళ్లు పార్లమెంటులో పార్టీ గళాన్ని బలంగా వినిపించిన ఆయన, 2024 ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో పదవులకు దూరమయ్యారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరపురంలోని తన వ్యవసాయ క్షేత్రంలో సామాన్య జీవితాన్ని గడుపుతున్నారు.
శంకరపురం ఫామ్ హౌస్‌లో విజయసాయి రెడ్డి పూర్తి ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో మిర్చి సాగు చేస్తున్నారు. రసాయనిక పురుగుమందులకు స్వస్తి చెప్పి, సొంతంగా తయారు చేసిన ‘అగ్నాస్త్రం’ను పంటపై పిచికారీ చేస్తూ కనిపించారు. ఆవు మూత్రం, వేప ఆకులు, వెల్లుల్లి, పచ్చిమిర్చి మరియు పొగాకు కలిపి తయారు చేసిన ఈ సహజసిద్ధమైన ద్రావణాన్ని ఆయనే స్వయంగా మొక్కలకు కొడుతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవడంతో పాటు, ప్రజలకు ఆరోగ్యకరమైన పంటను అందించడమే లక్ష్యంగా ఆయన ఈ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. అగ్నాస్త్రం వాడటం వల్ల లద్దె పురుగులు, ఇతర చీడపీడల నుండి పంటను రక్షించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు రాజకీయ విమర్శలతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసిన విజయసాయి రెడ్డి, ఇప్పుడు మట్టి మనిషిలా మారి పంటను కాపాడుకోవడంలో నిమగ్నమవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.