మక్తల్ శివారులో ఇసుక మాఫియా బీభత్సం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్

మక్తల్ మండల పరిధిలోని దాసర్పల్లి గ్రామ శివార్లలో అర్ధరాత్రి ఇసుక మాఫియా ఆగడాలు పరాకాష్టకు చేరాయి. పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్, నియంత్రణ కోల్పోయి పొలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మెపై నుంచి కిందపడిపోవడంతో పాటు విద్యుత్ స్తంభాలు విరిగిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన రైతు నర్సపొల్ల శీను వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో తృటిలో భారీ ప్రమాదం తప్పింది.
వరి సాగు కోసం ఏర్పాటు చేసుకున్న ట్రాన్స్‌ఫార్మర్, వైర్లు పూర్తిగా కాలిపోవడంతో రైతుకు భారీ నష్టం వాటిల్లింది. ఈ ఘటనపై ఇసుక మాఫియాను నిలదీయగా, కేవలం స్తంభాలు మాత్రమే ఇస్తామని, మిగతా నష్టం తాము భరించబోమని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే రాత్రిపూట అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు.
పోలీస్, రెవెన్యూ శాఖలు అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని ఈ ప్రమాదం నిరూపిస్తోంది. తమ ప్రాణాలకు, ఆస్తులకు ముప్పుగా మారిన ఇసుక మాఫియాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతుకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.