భారత గగనతలానికి కొత్త బలం, 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్

భారత వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రక్షణ శాఖ కీలక అడుగు వేసింది. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) అదనంగా 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ప్రాథమిక ఆమోదం తెలిపింది. సుమారు 3.25 లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ భారీ ప్రాజెక్టును ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా భారత్‌లోనే ఉత్పత్తి చేయనున్నారు. ఇది దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుందని భావిస్తున్నారు.
ఈ యుద్ధ విమానాల ఉత్పత్తి మరియు డెలివరీ ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు 5 నుండి 7 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. డిఫెన్స్ కౌన్సిల్ ఆమోదం పొందినప్పటికీ, దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రధానమంత్రి నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) నుండి అంతిమ అనుమతి లభించిన తర్వాతే ఈ కొనుగోలు ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఈ రాఫెల్ జెట్‌ల రాకతో భారత సరిహద్దుల్లో నిఘా మరియు రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది.