భారత్ మ్యాప్ నుంచి హిమాచల్ మాయం కావచ్చు, సుప్రీం కోర్ట్ ఆందోళన
August 3, 2025

హిమాచల్ ప్రదేశ్‌లో వాతావరణ మార్పులు, ప్రణాళిక లేని నిర్మాణాలు పర్యావరణ సమతుల్యతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇదే పరిస్థితి కొనసాగితే ఈ పర్వత రాష్ట్రం భారత పటం నుంచి కనుమరుగైపోవచ్చని హెచ్చరించింది. జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్‌ల ధర్మాసనం ఈ విపత్తుకు కేవలం ప్రకృతిని మాత్రమే నిందించడం సరికాదని, మానవ నిర్మిత కారణాలే ప్రధానమని స్పష్టం చేసింది.
రాష్ట్రానికి ఆదాయం పెంచుకోవడం కోసం పర్యావరణం, జీవావరణ వ్యవస్థను దెబ్బతీయడం ఆమోదయోగ్యం కాదని కోర్టు పేర్కొంది. హైకోర్టు నిర్ణయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోనప్పటికీ, ఈ తీవ్రమైన సమస్య గురించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. ఈ కఠిన హెచ్చరిక హిమాలయ రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో ఉందని సూచిస్తుంది.