భారత్ పాక్ సమరానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆ ఒక్క ఫోన్ కాలే.. పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ సంచలన నిజాలు

భారత్ పాక్ సమరానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆ ఒక్క ఫోన్ కాలే.. పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ సంచలన నిజాలు

భారత్ మరియు పాకిస్థాన్ జట్ల మధ్య మైదానంలో పోరు జరగడం వెనుక ఉన్న అసలైన ‘మాస్టర్ మైండ్’ ఎవరో బయటపడింది. మొన్నటి వరకు ససేమిరా అన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడం వెనుక ఉన్న ఆసక్తికర కథనాన్ని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ స్వయంగా వెల్లడించారు.

శ్రీలంక అధ్యక్షుడి ఎంట్రీతో మారిన సీన్

నిజానికి భారత్‌తో ఆడేందుకు పాకిస్థాన్ ససేమిరా అంది. అనేక చర్చలు జరిగినప్పటికీ ప్రతిష్టంభన కొనసాగింది. అయితే ఈ క్రమంలో శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన నేరుగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఫోన్ చేసి మాట్లాడటంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. ఆ ఒక్క ఫోన్ కాల్ తర్వాతే పాక్ ప్రధాని నుంచి నఖ్వీకి స్పష్టమైన ఆదేశాలు అందాయి. “ఇక ఏ అభ్యంతరాలు వద్దు.. మ్యాచ్ ఆడాల్సిందే” అని ప్రధాని తేల్చి చెప్పడంతో పాక్ జట్టు బరిలోకి దిగింది.

ఓటమి తర్వాత నఖ్వీ భావోద్వేగ వ్యాఖ్యలు

మ్యాచ్ ముగిసిన అనంతరం మొహ్సిన్ నఖ్వీ శ్రీలంక అధ్యక్షుడిని కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 కోట్ల మంది క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్‌ను ఆస్వాదించగలిగారంటే దానికి కారణం మీరేనంటూ ఆయనను కొనియాడారు. “నిన్నటి మ్యాచ్‌కు అసలైన హీరో మీరే” అని నఖ్వీ వ్యాఖ్యానించడం విశేషం.

మైదానంలో భారత్ హవా

ఇక ఆట విషయానికి వస్తే.. ఎంత బిల్డప్ ఇచ్చి బరిలోకి దిగినప్పటికీ పాకిస్థాన్‌కు భారత్ చుక్కలు చూపించింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ పోరులో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇషాన్ కిషన్ 77 పరుగులతో చెలరేగి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. కఠినమైన పిచ్‌పై భారత్ 175 పరుగులు చేయగా.. ఛేదనలో పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. భారత బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయి పాకిస్థాన్ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో పాక్ జట్టుపై ఇప్పుడు తీవ్ర ఒత్తిడి నెలకొంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *