బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ నాయకులకు గవర్నర్ వ్యవస్థ అన్నా, చట్టం అన్నా గౌరవం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మోసానికి కేరాఫ్ అడ్రస్ అని ఆయన విమర్శించారు. గవర్నర్ శుక్లా ప్రసంగం తమ ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధికి అద్దం పడుతోందని, ఇది చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలు గవర్నర్‌ను అవమానించేలా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
ప్రస్తుత ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంలోని అంశాలు వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయని, కానీ ప్రతిపక్షాలు కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వారి రాజకీయ అపరిపక్వతను సూచిస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే ఐదు గ్యారెంటీలు అమలు అవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. పథకాలు ప్రజల చెంతకు చేరుతున్నా బీఆర్ఎస్ నాయకులకు అవి కనిపించడం లేదా అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, ఇప్పటికైనా విమర్శలు మానుకొని నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు.