బడ్జెట్ లో భారీ ఊరట దిశగా రైల్వే టికెట్లపై సీనియర్ సిటిజన్ల రాయితీ పునరుద్ధరణ
February 1, 2026

రానున్న కేంద్ర బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్లకు రైలు టికెట్లపై రాయితీని పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పశ్చిమ బెంగాల్, కేరళ వంటి ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. ఐదేళ్ల విరామం తర్వాత ఈ సదుపాయం మళ్లీ అందుబాటులోకి వస్తే, ప్రభుత్వపై ఏటా సుమారు రెండు వేల కోట్ల రూపాయల అదనపు భారం పడే అవకాశం ఉంది.
ఆదివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో దీనిపై కీలక ప్రకటన వెలువడవచ్చని రైల్వే బోర్డు వర్గాల సమాచారం. కరోనా సమయంలో నిలిపివేసిన ఈ రాయితీ పునరుద్ధరణ ద్వారా దేశవ్యాప్తంగా కోట్ల మంది వృద్ధులకు మేలు చేకూరనుంది. ఓటర్లను ఆకట్టుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని బడ్జెట్ వేదికగా ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.