పెళ్లిలో సీఎం స్టాలిన్ మరి రిసెప్షన్‌లో దళపతి విజయ్, చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగిన జగన్ కుటుంబ వివాహం

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబంలో నేడు పెళ్లి సందడి నెలకొంది. జగన్ సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్, ప్రముఖ వ్యాపార దిగ్గజం మురుగప్ప గ్రూప్‌కు చెందిన అరుణ్ మురుగప్పన్ కుమార్తె సిగప్పిల వివాహం చెన్నైలో వైభవంగా జరిగింది. ప్రేమ వివాహం కావడంతో ఇరు కుటుంబాల ఆచారాల ప్రకారం ఈ వేడుకను నిర్వహించారు. ఉదయం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన వివాహానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన భార్య దుర్గతో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
సాయంత్రం అన్నా సాలైలోని ఒక ప్రముఖ స్టార్ హోటల్‌లో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు స్టార్ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. విజయ్ వస్తున్నారని తెలుసుకున్న స్టాలిన్ తన షెడ్యూల్ మార్చుకుని ఉదయమే పెళ్లికి వచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వేడుకలో మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం, హీరోలు సూర్య మరియు కార్తీ వంటి పలువురు ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.