పెళ్లికి నిరాకరించిందని యువతి శరీరంలోకి హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించిన ఉన్మాది

పెళ్లికి నిరాకరించిందని యువతి శరీరంలోకి హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించిన ఉన్మాది

హైదరాబాద్ శివార్లలోని పోచారం ఐటీ కారిడార్ పరిధిలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న కోపంతో, ఒక యువకుడు 24 ఏళ్ల యువతి శరీరంలోకి ఇంజెక్షన్ ద్వారా హెచ్ఐవీ సోకిన రక్తాన్ని ఎక్కించాడు. నిందితుడు వరుసకు బావ అవుతాడని, మార్చి 11న యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

పోలీసుల కథనం ప్రకారం, ఆరు నెలల క్రితమే వీరిద్దరికీ పెళ్లి నిశ్చయమైంది. అయితే ఆరోగ్య పరీక్షల్లో యువకుడికి హెచ్ఐవీ పాజిటివ్ అని తేలడంతో యువతి తల్లిదండ్రులు సంబంధాన్ని రద్దు చేసుకున్నారు. దీనిపై కక్ష పెంచుకున్న నిందితుడు, ఆమెకు కూడా వ్యాధి సోకితే మరెవరూ పెళ్లి చేసుకోరని, అప్పుడు తననే చేసుకోవాల్సి వస్తుందనే వికృత ఆలోచనతో ఈ పని చేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతికి ప్రాథమిక పరీక్షల్లో నెగటివ్ వచ్చినప్పటికీ, వైరస్ లక్షణాలు బయటపడటానికి సమయం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. రక్తకణాల్లో వైరస్ ఉండే అవకాశం ఉన్నందున, రాబోయే రెండు నెలల పాటు ఆమెకు దశలవారీగా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని నిపుణులు వెల్లడించారు. ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *