పగటి పూట గ్యాస్ సిలిండర్ చోరీ కోదాడలో సీసీటీవీకి చిక్కిన దొంగ

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పట్టపగలే జరిగిన గ్యాస్ సిలిండర్ చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం మధ్యాహ్నం ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఒక ట్రాక్టర్ మెకానిక్ షాపు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. జనసంచారం తక్కువగా ఉండటాన్ని గమనించిన ఒక గుర్తు తెలియని వ్యక్తి, షాపు బయట ఉన్న గ్యాస్ సిలిండర్ను చాకచక్యంగా ఎత్తుకెళ్లాడు.
సిలిండర్ కనిపించకపోవడంతో యజమాని చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయింది. చివరకు షాపులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ఒక వ్యక్తి సిలిండర్ను భుజాన వేసుకుని వెళ్తున్న దృశ్యాలు బయటపడ్డాయి. గ్యాస్ కొరత మరియు ధరల పెరుగుదల నేపథ్యంలో దొంగలు ఇప్పుడు సిలిండర్లపై కన్నేయడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నామని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. కోదాడలో ఇటీవల వరుస దొంగతనాలు పెరుగుతుండటంతో వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు. విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు.