నిమ్మరసానికి గ్యాస్ సెర్ ఛార్జీలు విధిస్తూ కస్టమర్ల జేబులకు చిల్లు పెడుతున్న హోటళ్లు

మధ్యప్రాచ్యంలో యుద్ధం సాకుతో సామాన్యులను దోచుకోవడానికి వ్యాపారులు కొత్త దారులు వెతుకుతున్నారు. బెంగళూరులోని కొన్ని కేఫ్లు మరియు హోటళ్లు బిల్లులపై ‘గ్యాస్ క్రైసిస్ ఛార్జ్’ పేరుతో అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని బిల్లులు చూసి నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలు గ్యాస్‌తో సంబంధం లేని నిమ్మరసం వంటి పానీయాలపై కూడా ఈ గ్యాస్ సంక్షోభ రుసుము వసూలు చేయడం గమనార్హం.
బెంగళూరులోని ఒక కేఫ్‌లో ఇద్దరు కస్టమర్లు రెండు పుదీనా నిమ్మరసాలు తాగగా, వారికి ఏకంగా 374 రూపాయల బిల్లు వచ్చింది. సాధారణ ధర కంటే అదనంగా 5 శాతం గ్యాస్ క్రైసిస్ ఛార్జీని ఇందులో కలిపారు. మరో ఘటనలో రెండు ఇడ్లీలు, ఒక వడ ధర 66 రూపాయలు కాగా, దానికి 10 రూపాయల గ్యాస్ ఛార్జీని కలిపి, మళ్ళీ ఆ ఛార్జీపై కూడా జీఎస్టీ వేసి మొత్తం 80 రూపాయలు వసూలు చేశారు. హోటల్ యాజమాన్యాల తీరుపై కస్టమర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ దోపిడీపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిమ్మరసం తయారు చేయడానికి గ్యాస్ ఎక్కడ వాడుతారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. యుద్ధం వల్ల వాణిజ్య సిలిండర్ల ధరలు పెరిగిన మాట వాస్తవమే అయినా, ఇలా ప్రతి చిన్న వస్తువుపై అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేయడం అన్యాయమని వారు మండిపడుతున్నారు. ఈ వింత ఛార్జీల బిల్లులు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.