నమీబియాతో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్కు ముందు టీమ్ ఇండియాకు షాక్, ఆసుపత్రిలో చేరిన అభిషేక్ శర్మ
February 11, 2026

టీ20 ప్రపంచకప్లో నమీబియాతో తలపడనున్న తరుణంలో టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అనారోగ్యానికి గురవ్వడంతో ఆయనను అత్యవసరంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అందుతున్న సమాచారం ప్రకారం, తీవ్రమైన కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న అభిషేక్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయనకు పలు వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆ రిపోర్టుల కోసం జట్టు యాజమాన్యం వేచి చూస్తోంది.
అభిషేక్ శర్మ ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుండి ఇంకా స్పష్టమైన ప్రకటన రాలేదు. పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే ఆయన అనారోగ్యానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని సమాచారం. అయితే నమీబియాతో జరగబోయే కీలక మ్యాచ్లో ఆయన ఆడే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. టోర్నమెంట్ మధ్యలో ఓపెనర్ ఆసుపత్రి పాలవ్వడం భారత జట్టులో ఆందోళన కలిగిస్తోంది.