తెలంగాణ రైతులకు శుభవార్త అకౌంట్లలోకి నగదు జమ

తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల నిరీక్షణకు తెరదించుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా నిధుల విడుదల తేదీని ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. మార్చి 22వ తేదీన సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 73 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ కానుంది.
యాసంగి సీజన్‌కు సంబంధించి మొత్తం 9 వేల కోట్ల రూపాయల నిధులను మూడు విడతల్లో పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో భాగంగా 3,590 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నారు. మొదటి విడత జరిగిన 20 రోజుల తర్వాత రెండో విడత, ఏప్రిల్ నెలాఖరు కల్లా మూడో విడత నిధులు రైతుల ఖాతాల్లో పడతాయి. గతంలో ఈ పథకం పొందిన వారితో పాటు, ఈసారి కౌలు రైతులకు కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
అయితే, ఈ పథకం అమలులో పారదర్శకత కోసం ప్రభుత్వం కఠిన నిబంధనలను రూపొందించింది. ధరణి పోర్టల్‌లో భూమి వివరాలు నమోదు లేని వారికి, వ్యవసాయేతర వాణిజ్య భూములకు ఈ పథకం వర్తించదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు మరియు ప్రజా ప్రతినిధులను ఈ పథకం నుండి మినహాయించారు. ఆలయాలు, ట్రస్టుల పేరిట ఉన్న సాగు భూములకు కూడా రైతు భరోసా వర్తించదని అధికారులు స్పష్టం చేశారు.