తెలంగాణ నీటి ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్

తెలంగాణ నీటి ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం గోదావరి జలాలను తరలించేందుకు సిద్ధమవుతున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనం వహించడం వెనుక ఉన్న మర్మమేమిటని ప్రశ్నించారు. సిడబ్ల్యూసి (CWC) తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

జనవరి 30న జరిగిన సమావేశానికి సంబంధించిన మినిట్స్‌పై ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడంపై హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్రాల మధ్య గోదావరి జలాల పంపిణీ లేదని ఆ మినిట్స్‌లో స్పష్టంగా పేర్కొన్నా, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణకు శాశ్వత నష్టం కలిగించే విధంగా కేంద్రం అడుగులు వేస్తున్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం నిద్రపోతోందని ఆయన ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇది తెలంగాణ ప్రజలకు చేస్తున్న ద్రోహమని హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్ర నీటి వాటాను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని, కేవలం లేఖలతో కాలక్షేపం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాడాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *