ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టిన ఇసుక మాఫియా ట్రాక్టర్ మంటల్లో సర్వం భస్మం

ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టిన ఇసుక మాఫియా ట్రాక్టర్ మంటల్లో సర్వం భస్మం

మక్తల్ మండలంలోని దాసర్పల్లి గ్రామ శివార్లలో అర్ధరాత్రి వేళ అక్రమ ఇసుక రవాణా బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న ఇసుక ట్రాక్టర్ పొలంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను బలంగా ఢీకొట్టడంతో అది కాస్తా కిందపడి దౌడౌన మండిపోయింది. ఈ ప్రమాదంలో ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు దానికి అనుసంధానంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, వైర్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అదృష్టవశాత్తూ పొలం యజమాని వెంటనే అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.

బాధిత రైతు నర్సపొల్ల శీను తన పొలంలో సాగు కోసం ఏర్పాటు చేసుకున్న ఈ వ్యవస్థ అక్రమ రవాణాదారుల నిర్లక్ష్యం వల్ల ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరిగిన తర్వాత ఇసుక మాఫియా యజమానులను సంప్రదించగా, వారు అత్యంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం గమనార్హం. కేవలం స్తంభాలు మాత్రమే ఇస్తామని, మిగతా నష్టాన్ని రైతులే భరించాలని వారు బెదిరింపు ధోరణిలో మాట్లాడటం స్థానికంగా చర్చనీయాంశమైంది.

అక్రమ ఇసుక రవాణాను అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని మక్తల్, మాగనూర్ పరిసర ప్రాంతాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నా పోలీసులు, రెవెన్యూ శాఖ పట్టించుకోవడం లేదని ఈ ప్రమాదమే దానికి నిదర్శనమని వారు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ రవాణాను అరికట్టి, నష్టపోయిన రైతుకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *