ట్రంప్‌ను కలిసేందుకు షాబాజ్, మునీర్‌కు 30 నిమిషాల నిరీక్షణ! వైట్‌హౌస్ భేటీపై ఉత్కంఠ

పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. 2019 తర్వాత పాక్ ప్రధానితో ట్రంప్ జరిపిన మొట్టమొదటి సమావేశం ఇదే కావడంతో, పహల్గామ్ దాడి ఉద్రిక్తతలు, భారత్-అమెరికా సుంకాల పోరు మధ్య ఈ భేటీకి అంతర్జాతీయంగా ప్రాధాన్యత పెరిగింది. మూసి ఉన్న గదుల వెనుక జరిగిన ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, భద్రతా సహకారం, ఆఫ్ఘనిస్తాన్‌తో సహా పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం.
అయితే, ఈ ఉన్నత స్థాయి సమావేశం సమయాన్ని గురించి వివాదం తలెత్తింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా, ట్రంప్ పరిపాలనా కార్యకలాపాల కారణంగా షాబాజ్, మునీర్‌లను దాదాపు 30 నిమిషాలు వేచి ఉండేలా చేశారు. పాక్ బృందం చివరకు సాయంత్రం 6:18 గంటలకు వైట్‌హౌస్ నుండి బయలుదేరింది. సమావేశానికి ముందు, ట్రంప్ షరీఫ్‌ను “గొప్ప నాయకుడు” అని, మునీర్‌ను “గొప్ప వ్యక్తి” అని ప్రశంసించారు. వైట్‌హౌస్ ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించకపోవడంతో, ఆకస్మికంగా జరిగిన ఈ రహస్య సమావేశంపై దౌత్య వర్గాల్లో విపరీతమైన ఊహాగానాలు మొదలయ్యాయి.