టీ20 వరల్డ్ కప్ వేళ భారత్‌కు గట్టి షాక్, ఆస్పత్రిలో చేరిన స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ

టీ20 ప్రపంచకప్ 2026లో టీమ్ ఇండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్రమైన కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా ఆస్పత్రిలో చేరారు. ఫిబ్రవరి 7న అమెరికాతో జరిగిన మ్యాచ్ సమయంలోనే ఆయన తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడ్డట్లు సమాచారం. పరిస్థితి విషమించడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఫిబ్రవరి 10న జరిగిన టీమ్ ప్రాక్టీస్ సెషన్లో కూడా అభిషేక్ కనిపించలేదు. అమెరికాతో మ్యాచ్‌లో ఆయన బ్యాటింగ్ చేసినా, అనారోగ్యం కారణంగా ఫీల్డింగ్‌కు రాలేదని, ఆయన స్థానంలో సంజూ శామ్సన్ ఫీల్డింగ్ చేశారని టీమ్ మేనేజ్మెంట్ వెల్లడించింది.
ఫిబ్రవరి 12న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో భారత్ తలపడనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ ఆడటం అసాధ్యమని తెలుస్తోంది. గత 24 గంటల్లో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు సమాచారం. అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ డోషేట్ అభిషేక్ కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసినా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు కనిపిస్తోంది. అభిషేక్ అందుబాటులో లేకపోవడంతో నమీబియాతో మ్యాచ్‌లో సంజూ శామ్సన్ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. బుధవారం జరిగే ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఆరోగ్యంపై మరింత స్పష్టత రానుంది.