చేపల ప్రియులకు గుడ్ న్యూస్ ముళ్లు లేని చేపలను సృష్టించిన చైనా శాస్త్రవేత్తలు

చేపలు తినేటప్పుడు గొంతులో ముళ్లు గుచ్చుకుంటాయనే భయం ఇక అక్కర్లేదు. చైనా శాస్త్రవేత్తలు అత్యాధునిక సాంకేతికతతో ముళ్లు లేని చేపలను ల్యాబ్లో తయారు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. చైనాలో ఎక్కువగా తినే ‘గిబెల్ కార్ప్’ చేపలలో ఉండే ఎనభైకి పైగా సన్నని ముళ్ల వల్ల గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. ఈ ముళ్లు ఏర్పడటానికి కారణమయ్యే సిజిఆర్యూఎన్ఎక్స్2బి అనే జన్యువును చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు గుర్తించి ‘సిఆర్ఐఎస్పిఆర్’ విధానం ద్వారా దానిని తొలగించారు.
ఈ జన్యు మార్పిడి వల్ల పుట్టిన చేపలలో కేవలం వెన్నెముక మాత్రమే ఉండి మాంసంలో ఉండే సన్నని ముళ్లు పూర్తిగా మాయమయ్యాయి. దీనివల్ల చేప రుచిలో గానీ ఎదుగుదలలో గానీ ఎలాంటి మార్పు రాలేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ముఖ్యంగా పిల్లలకు చేపలు తినిపించే సమయంలో తల్లిదండ్రులు పడే ఆందోళనను ఈ ఆవిష్కరణ దూరం చేయనుంది. ఎముకలు లేని ఈ కొత్త రకం చేపలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.